Tuesday 14 January 2014

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె



అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు

మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
ఎదుట తాను రాజైతే ఏలెనాపరము

పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా

అంతర్యామి అలసితి సొలసితి



అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

అందరికి నెక్కుడైన హనుమంతుడు



అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

ఆలించు పాలించు ఆదిమ పురుషా




ఆలించు పాలించు ఆదిమ పురుషా
జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥

గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె
పతివినీవె ఏ పట్టున మాకు
ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల
చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥

జననీ జనకులు శరణము నీవె
వునికి మనికి నీవె వుపమ నీవె
మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకోటేనె
చనవి మనవి శరణుజొచ్చితిమి॥

లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె
ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ
సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥

అలవటపత్రశాయివైన రూప మిట్టిదని



అలవటపత్రశాయివైన రూప మిట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందరాజా

పడతులిద్దరిమీద పాదములు చాచుకొని
వొడికపురాజసాన నొత్తగిలి
కడలేనిజనాభికమలమున బ్రహ్మను
కొడుకుగా గంటివిదె గోవిందరాజా

సిరులసొమ్ములతోడ శేషునిపై బవళించి
సొరిది దాసుల గౄప జూచుకొంటాను
పరగుదైత్యులమీద పామువిషములే నీవు
కురియించితివా గోవిందరాజా

శంకుజక్రములతోడ జాచినకరముతోడ
అంకెల శిరసుకిందిహస్తముతోడ
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా

అలరులు గురియగ నాడెనదే



అలరులు గురియగ నాడెనదే
అలకల గులుకుల నలమేలుమంగ

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ

అలర చంచలమైన



అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల